II పేతురు1 యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది. 2 తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, 3 దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. 4 ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్య ములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను 5 ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణ మును,సద్గుణమునందు జ్ఞానమును, 6 జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనము నందు భక్తిని, 7 భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. 8 ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలు లైనను కాకుండ చేయును. 9 ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును. 10 అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి.మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. 11 ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. 12 కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. 13 మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి, 14 నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను. 15 నేను మృతిపొందిన తరువాత3 కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును. 16 ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని 17 ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు.ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చి నప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా 18 మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. 19 మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు. 20 ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. 21 ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. 1 మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. 2 మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. 3 వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. 4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. 5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను. 6 మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, 7 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. 8 ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచినవాటినిబట్టియు వినినవాటినిబట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. 9 భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను ముఖ్య ముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు కొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, 10 శి క్షలో ఉంచ బడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు. 11 దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు. 12 వారైతే పట్టబడి చంప బడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు, 13 ఒకనాటి సుఖాను భవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంక ములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగ ములయందు సుఖించుదురు. 14 వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వ మందు సాధకముచేయబడిన హృదయముగలవారును, శాప గ్రస్తులునైయుండి, 15 తిన్ననిమార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి. 16 ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహు మానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను. 17 వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది. 18 వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు. 19 తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా 20 వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింప బడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును. 21 వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసి కొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు. 22 కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను. 1 ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను 2 పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. 3 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, 4 ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్త మును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవ 5 ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. 6 ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. 7 అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి. 8 ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. 9 కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. 10 అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదన 11 ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, 12 దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. 13 అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును. 14 ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. 15 మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. 16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. 17 ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి. 18 మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభి వృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. |