I తిమోతికి

1

1 మన రక్షకుడైన దేవునియొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసుయొక్కయు ఆజ్ఞప్రకారము క్రీస్తుయేసు యొక్క అపొస్తలుడైన పౌలు, 2 విశ్వాసమునుబట్టి నా నిజ మైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. 3 నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును, 4 విశ్వాససంబంధమైన దేవుని యేర్పా టుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించు టకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చ రించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. 5 ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. 6 ​కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను, 7 ​నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. 8 ​అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్తప్రకారము, 9 ​ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూష కులకును పితృహంతకులకును మాతృహంతకులకును నర హంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును, 10 ​హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని, 11 ​నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము. 12 ​పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, 13 ​నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. 14 ​మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వా సమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను. 15 ​పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. 16 ​అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని. 17 సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌. 18 నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. 19 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలై పోయినవారివలె చెడియున్నారు. 20 వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.

2

1 మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును 2 రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చ రించుచున్నాను. 3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. 4 ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు. 5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. 6 ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. 7 ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. 8 కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. 9 మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్య ములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలం కరించుకొనక, 10 దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించు కొనవలెను. 11 స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధే యతతో నేర్చుకొనవలెను. 12 స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధి కారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. 13 మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? 14 మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను. 15 అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలు కడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింప బడును.

3

1 ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. 2 అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషు డును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యా దస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునై యుండి, 3 మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వి కుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై, 4 సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను. 5 ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? 6 అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండు నట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు. 7 మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను. 8 ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభము న పేక్షించువారునైయుండక 9 విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను. 10 మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. 11 అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై3 కొండెములు చెప్పనివారును,4 మితాను భవముగలవారును, అన్ని విషయ ములలో నమ్మకమైనవారునై యుండవలెను. 12 పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను. 13 పరిచారకులైయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు. 14 శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను; 15 అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిర ములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రా¸ 16 నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.

4

1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును 2 దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. 3 ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞ తాస్తుతులు చెల్లించిపుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పు చుందురు. 4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు; 5 ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనవలనను పవిత్రపరచ బడుచున్నది. 6 ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల,నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుందువు. 7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము. 8 శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తియిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. 9 ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మునైయున్నది. 10 మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. 11 ఈ సంగతుల నాజ్ఞాపించి బోధించుము. 12 నీ ¸°వనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 13 నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. 14 పెద్దలు హస్తనిక్షేపణముచేయగా ప్రవచనమూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. 15 నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము. 16 నిన్నుగూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.

5

1 వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చ రించుము. 2 అన్నదమ్ములని ¸°వనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో ¸°వనస్త్రీలను హెచ్చరించుము. 3 నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. 4 అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు 5 అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై యుండి, దేవునిమీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాప నలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును. 6 సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదైయుండును. 7 వారు నిందారహితులై యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము. 8 ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును. 9 అరువది ఏండ్ల కంటె తక్కువవయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై, 10 సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. 11 ¸°వనస్థులైన విధవ రాండ్రను లెక్కలో చేర్చవద్దు; 12 వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు. 13 మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు. 14 కాబట్టి ¸°వన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరు చున్నాను. 15 ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి. 16 విశ్వాసురాలైన యే స్త్రీ యింటనైనను విధవరాండ్రుండినయెడల, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారములేకుండ ఆమెయే వీరికి సహాయము చేయవలెను. 17 బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్య మందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. 18 ఇందుకు నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. 19 మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషా రోపణ అంగీకరింపకుము 20 ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము. 21 విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవ దూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను. 22 త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాప ములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. 23 ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. 24 కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాప ములు వారివెంట వెళ్లుచున్నవి. 25 అటువలె మంచికార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు.

6

1 దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడ కుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచ వలెను. 2 విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. 3 ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీక రింపక, భిన్నమైనబోధనుపదేశించినయెడల 4 వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురను మానములును, 5 చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి. 6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. 7 మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. 8 కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము. 9 ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. 10 ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. 11 దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము. 12 విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. 13 సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్య ముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను, 14 మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. 15 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. 16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ ముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. 17 ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమి్మకయుంచక,సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమి్మకయుంచుడని ఆజ్ఞాపించుము. 18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసి కొనుచు, మేలుచేయువారును, 19 సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము. 20 ఓ తిమోతి, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అప విత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. 21 ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విష యము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.




AMAZING GRACE BIBLE INSTITUTE